Bandi Sanjay: నీటివాటా కోసం మాట్లాడకుండా తోక ముడిచాడు: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay fires on CM KCR after Apex Council meet

  • అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తెలుగు సీఎంల హాజరు
  • ఇద్దరూ కుమ్మక్కయ్యారన్న బండి సంజయ్
  • కేసీఆర్ ట్రైబ్యునల్ పేరుతో మోసం చేశాడంటూ ఆగ్రహం

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఇవాళ వర్చువల్ విధానంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ పాల్గొన్నారు. అయితే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీ జలాల వాటాల అంశంలో కుమ్మక్కయ్యారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.

ఇద్దరు సీఎంల మాట ఒకటేనని అపెక్స్ కౌన్సిల్ సమావేశంతో వెల్లడైందని, వారిద్దరూ తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణాజలాలు 575 టీఎంసీల మేర రావాల్సి ఉండగా, 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని, ఇవాళ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆ విషయం రుజువైందని అన్నారు. నాడు 299 టీఎంసీల కోసం కేసీఆర్ సంతకం పెట్టిన నేపథ్యంలో, ఏపీ అదే అంశాన్ని ఉటంకిస్తూ 299 టీఎంసీలే అంటోందని బండి సంజయ్ మండిపడ్డారు.

ట్రైబ్యునల్ పేరుతో నాటకాలు ఆడుతూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వాటాను అడగకుండా కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం తలపెడుతున్నాడని అన్నారు. కేసీఆర్ చేతకానితనంతోనే కృష్ణా నీటి వాటా కోల్పోయామని, ఆరేళ్ల నుంచి ట్రైబ్యునల్ పేరిట మభ్యపెడుతూ, నీటివాటా కోసం మాట్లాడకుండా తోకముడిచాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ నోటివెంట శ్రీశైలం కోసం ఒక్క మాట కూడా రాలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News