Khulbhushan Jhadav: జాదవ్ తరఫున మేం వాదించం... పాక్ సీనియర్ న్యాయవాదుల నిర్ణయం
- జాదవ్ తరఫున వాదించాలని ఇస్లామాబాద్ హైకోర్టు సూచన
- తాను రిటైరయ్యానని చెప్పిన ఓ న్యాయవాది
- తనకు వేరే పనులున్నాయని తప్పించుకున్న మరో లాయర్
గూఢచర్యం ఆరోపణలపై గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ జైలులో మగ్గుతూ మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కష్టాలు ఇప్పట్లో తీరేట్టు కనిపించడంలేదు. జాదవ్ తరఫున వాదించకూడదని పాక్ న్యాయవాదులు నిర్ణయించుకోవడమే అందుకు కారణం.
జాదవ్ తరఫున వాదించాలని మఖ్దూం అలీఖాన్, అబిద్ హసన్ మింటో అనే ఇద్దరు సీనియర్ లాయర్లను ఇస్లామాబాద్ హైకోర్టు కోరింది. అయితే వారిద్దరూ అందుకు నిరాకరించారు. తాను ఇప్పటికే రిటైరయ్యానని అబిద్ హసన్ మింటో పేర్కొనగా, తనకు వేరే పనులు ఉన్నాయని మఖ్దూం అలీఖాన్ చెప్పారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ కు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
పాకిస్థాన్ లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందే ఊహించిన భారత్... భారత న్యాయవాదిని, లేక క్వీన్స్ కౌన్సెల్ ను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ విదేశాంగ శాఖ అందుకు కూడా అనుమతించలేదు. దాంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పును పాకిస్థాన్ గౌరవించాల్సిందేనంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది.