Bihar: నేను మరోమారు చెబుతున్నా.. ఎవరెన్ని స్థానాల్లో గెలిచినా నితీశే సీఎం: బీహార్ బీజేపీ చీఫ్
- కాంగ్రెస్, ఆర్జేడీలపై నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు
- సీట్ల పంపకం విషయంలో గందరగోళం లేదన్న సీఎం
- ఎల్జేపీ బయటకు వెళ్లి తప్పు చేసిందన్న ఉప ముఖ్యమంత్రి
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 122, బీజేపీ 121 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, జేడీయూ 115 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి మిగతా ఏడుస్థానాలను హిందూస్థానీ అవామ్ మోర్చాకు కేటాయించింది.
ఈ నేపథ్యంలో సంజయ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం నితీశ్ కుమారేనని మరోమారు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. తమ పనిని చూసి ఓట్లు వేయాలని కోరుతున్నట్టు చెప్పారు. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్, ఆర్జేడీలు కలిసి రాష్ట్రాన్ని అల్లర్ల మయం చేశాయని విమర్శించారు. బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు వెళ్లి తప్పుడు నిర్ణయం తీసుకుందన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ ఆపరేషన్‌కు వెళ్లకపోయి ఉంటే ఆయన కుమారుడు చిరాగ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదన్నారు.
కాగా, బీహార్‌లో మూడు దశల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా, తొలి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 28న జరగనుంది, రెండుమూడు దశలు నవంబరు 3, 7న జరగనున్నాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడించనున్నారు.