Corona Virus: కరోనా రోగుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురికి ఎన్నో రకాల సమస్యలు!
- తలనొప్పి, అయోమయం, తీవ్ర అలసట సమస్యలు
- వాసన, రుచి కోల్పోవడం కూడా
- తాజా అధ్యయనంలో వెల్లడి
కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన వారిలో అత్యధికులకు నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ప్రతి ఐదుగురిలో నలుగురికి... అంటే సుమారు 80 శాతం మందిలో కండరాల నొప్పులు, తలనొప్పి, అయోమయం, తీవ్ర అలసట, వాసన కోల్పోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయని ఈ రీసెర్చ్ నిర్వాహకుల్లో ఒకరైన షికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ లో న్యూరో ఇన్ఫెక్షన్ డిసీజ్ విభాగం చీఫ్ ఇగోర్ కొరాల్నిక్ వ్యాఖ్యానించారు.
కరోనా సోకిన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందిన 509 రోగులపై ఈ అధ్యయనం సాగిందని వెల్లడించిన ఆయన, వారిలో మానసిక సమస్యలు కూడా ఏర్పడ్డాయని తెలిపారు. స్వల్ప లక్షణాలతో ఉన్నా, లక్షణాలు లేకున్నా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలోనూ దీర్ఘకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, కొన్ని నెలల తరబడి శరీరంలోనే వైరస్ తిష్ట వేసుకుని కూర్చుంటుందని కొరాల్నిక్ హెచ్చరించారు. 55 సంవత్సరాల వయసున్న వారితో పోలిస్తే, 65 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి సోకితే మరింత ప్రమాదకరమని అన్నారు.
ఈ అధ్యయనం వివరాలు "అనాల్స్ ఆఫ్ క్లినికల్ అండ్ ట్రాన్స్ లేషనల్ న్యూరాలజీ" జర్నల్ లో ప్రచురితమయ్యాయి. నరాలకు సంబంధించిన సమస్యలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయని కొరాల్నిక్ తెలిపారు. ఇదే సమయంలో తమ అధ్యయన నివేదికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య పరిస్థితితో పోల్చేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ట్రంప్ ఇటీవల కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆపై కోలుకున్నానంటూ, డిశ్చార్జ్ అయి, వైట్ హౌస్ కు కూడా చేరుకున్నారు.