AIADMK: అన్నాడీఎంకేలో రాజకీయ వివాదాలకు తెర.. సీఎం అభ్యర్థి ఎవరో తేలిపోయేది నేడే!
- అన్నాడీఎంకేలో నేడు కీలక సమావేశం
- పళని, పన్నీర్ ఇద్దరూ సమష్టిగా ప్రకటన చేసే అవకాశం
- సమష్టిగా ముందుకెళ్తామన్న మంత్రి జయకుమార్
అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఈ మేరకు నేడు కీలక సమావేశం జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రి ఎవరన్న ప్రకటన వెలువడనుందని సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ ఇటీవల మొదలైంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు తమకు మద్దతు పలికే నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. నిన్న కూడా చర్చలు జరిగాయి. మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, తంగమణి, ఆర్‌బీ ఉదయకుమార్‌లు ఇరువురు నేతలతో సమావేశమై చర్చించారు.
పన్నీర్ సెల్వంతో సమావేశమైన సమన్వయ కమిటీ ప్రతినిధులు వైద్యలింగం, కేపీ మునుస్వామి.. సీఎం అభ్యర్థి, ప్రధాన కార్యదర్శి, మార్గదర్శక కమిటీల ఎంపిక వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా, ఇటీవల నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని నేడు ప్రకటించాల్సి ఉంది. ఇవాళ జరగనున్న పార్టీ సమావేశం సామరస్యపూర్వకంగా సాగే అవకాశాలున్నాయని, నేతలిద్దరూ ఐక్యంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
అయితే, సీఎం అభ్యర్థి ఎవరనే ప్రకటన నేడు ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. మార్గదర్శక కమిటీలోని మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు మరో రోజు ఇందుకు సంబంధించిన ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు. అమ్మపాలన మళ్లీ రావాలన్న సంకల్పంతో సమష్టిగా ముందుకే సాగే అవకాశాలు ఉన్నాయని మంత్రి జయకుమార్ తెలిపారు.