nims: నిమ్స్‌లో ఆందోళనకు దిగి.. విధులు బహిష్కరించిన నర్సింగ్ సిబ్బంది
- కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి సేవలు
- సరైన గుర్తింపు ఇవ్వట్లేదు
- ప్రోత్సాహకాలు సైతం ఇవ్వట్లేదు
- హామీ ఇచ్చేవరకు విధుల్లో చేరబోము
వేలాది మంది రోగులకు సేవలు అందించే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. కరోనా విజృంభణ సమయంలోనూ తాము తమ ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నామని, అయినప్పటికీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదని, ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.
నిధులు ఉన్నప్పటికీ తమకు రావాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదని తెలిపారు. కరోనా సమయంలో సేవలందిస్తోన్న తమను ఫ్రంట్ వారియర్స్ అంటూ ఒట్టి మాటలతో పొగడడమే తప్ప తమను పట్టించుకునే వారే లేరని వారు వ్యాఖ్యానించారు. కాగా, ఆందోళనకు దిగే ముందు తమ సమస్యలపై ఈ రోజు ఉదయం దాదాపు రెండు గంటల పాటు నర్సింగ్ స్టాఫ్ అందరూ సమావేశమై విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్వయంగా తమకు రాతపూర్వక హామీ ఇచ్చే వరకు తాము తిరిగి విధుల్లో చేరబోమని వారు స్పష్టం చేశారు.