Ramcharan: దివ్యాంగుల కోసం.. డ్యాన్స్ షో ప్రారంభిస్తోన్న రామ్చరణ్, ఉపాసన!
- కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం
- ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం
- urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ
దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపాలని వారు భావిస్తున్నారు. దివ్యాంగులు తమ జీవితంలో ఎదుర్కొన్న ఛాలెంజ్లను ఎలా అధిగమించారు? వారు తమ ఆశయాలను ఎలా సాధించారు? అన్న స్ఫూర్తిదాయక విషయాలను చెర్రీ, ఉపాసన చూపించనున్నారు.
వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందడుగు వేయాలని ఉపాసన చెప్పింది. ఈ సందర్బంగా ఆమె కొందరు దివ్యాంగుల కష్టాలు, వారు వాటిని అధిగమించిన పరిస్థితులను వివరించారు. వారిని చూసి స్ఫూర్తిపొందాలని అన్నారు.
తన హృదయానికి ఎంతో చేరువైన విషయం డ్యాన్సని రామ్ చరణ్ అన్నాడు. సంగీతం, డ్యాన్స్ తనను బాల్యం నుంచే చాలా మందికి చేరువ చేశాయని చెర్రీ చెప్పాడు. ఈ డ్యాన్స్ షోలో పాల్గొనాలనుకునే దివ్యాంగులు urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించాడు. ఈ కార్యక్రమానికి అందరి నుంచి ఆయన మద్దతు కోరాడు. నృత్య దర్శకుడు ప్రభుదేవా కూడా వీరికి మద్దతు ఇస్తున్నాడు.