US Elections: ట్రంప్ ఓ విఫల అధ్యక్షుడిగా మిగిలిపోతారన్న కమల హారిస్.. ఒట్టి మాటలు కట్టిపెట్టాలన్న మైక్ పెన్స్
- వాడివేడిగా ఉపాధ్యక్ష అభ్యర్థుల సంవాదం
- ట్రంప్ అసమర్థతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న కమల
- ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దన్న మైక్ పెన్స్
వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ అమెరికాలో రాజకీయ వాతావరణం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లు ఇటీవల ముఖాముఖిగా తలపడగా, తాజాగా స్టాల్‌లేక్‌లోని కింగ్స్ బర్రీహాల్‌లో ఉపాధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి జరిగింది. తొలుత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తొలుత మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని అరికట్టడంలో అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అమెరికా చరిత్రలోనే ఆయనో విఫల అధ్యక్షుడిగా మిగిలిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అసమర్థత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒబామా కేర్‌ను ట్రంప్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
కమలా హరిస్ విమర్శలను ట్రంప్ రన్నింగ్ మేట్ మైక్ పెన్స్ ఖండించారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. కరోనాపై మొత్తం ఐదు కంపెనీలు ప్రయోగాలు చేపట్టాయని, అవన్నీ ప్రస్తుతం మూడో దశలో ఉన్నాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ ఒత్తిడి కారణంగా విడుదలయ్యే టీకాను విశ్వసించవచ్చా? అన్న కమల ప్రశ్నకు మైక్ పెన్స్ తీవ్రంగా స్పందించారు. టీకాపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు.