Rafale: గగనతలంలో యుద్ధ విమానాల విన్యాసాలు.. అబ్బురపరిచిన రాఫెల్ జెట్లు... వీడియో ఇదిగో!
- నేడు వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం
- హిండన్ ఎయిర్ బేస్ లో ప్రత్యేక వేడుకలు
- అభినందనలు తెలిపిన మోదీ, రాజ్ నాథ్
భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో రాఫెల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గాల్లో ఈ విమానాలు చేసిన విన్యాసాలను చూసిన వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమాలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని వాయుసేనకు అభినందనలు తెలిపారు.
"ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా, మన ధైర్యవంతులైన సైనికులకు అభినందనలు. మీరు కేవలం దేశపు గగనాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా, విపత్తుల సమయంలో అపరిమితమైన సేవ చేస్తున్నారు. మీ ధైర్యం, నిబద్ధత, దేశ రక్షణకు చూపుతున్న దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శం" అని ట్వీట్ చేశారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం అభినందనలు తెలుపుతూ, వాయుసేనను చూసి జాతి యావత్తూ గర్విస్తోందని అన్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను పైలట్లు ఎదుర్కొంటూ, దేశానికి సేవలందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదూరియా, ఇటీవలే రాఫెల్, అపాచీ ఎయిర్ క్రాఫ్ట్ లు వాయుసేనలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. వీటి బలమేంటో శత్రువులకు తెలుసునని అన్నారు. అధునాత యుద్ధ విమానాల రాకతో వాయుసేన శక్తి పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాలు గాల్లో పలు రాకాల ఫార్మేషన్స్ ను ప్రదర్శించాయి. వీటిని వందలాది మంది తిలకించారు. ఆ వీడియోలను మీరూ చూడవచ్చు.