Sonu Sood: సోనూసూద్‌పై స్కూల్ ప్రాజెక్ట్ చేసిన శిల్పాశెట్టి కొడుకు.. భావోద్వేగంతో వీడియో పోస్ట్
- సోనూ ఫ్యాన్ అయిపోయిన శిల్పాశెట్టి కుమారుడు వియాన్ (8)
- యానిమేటెడ్ వీడియో రూపొందించిన వియాన్
- సోనూసూద్ చేసిన సేవలకు ఫిదా అయ్యాడన్న శిల్ప
దేశంలోని పేద ప్రజలు సాయం అడిగిన వెంటనే స్పందిస్తూ రియల్ హీరో అనిపించుకుంటోన్న సినీనటుడు సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురుస్తోన్న విషయం తెలిసిందే. చిన్నారులు కూడా ఆయనను రియల్ హీరో, సూపర్ మన్ అంటున్నారు. సినీనటి శిల్పాశెట్టి కుమారుడు వియాన్ (8) కూడా సోనూసూద్ చేస్తోన్న సేవల పట్ల ఆకర్షితుడయ్యాడు.
తన స్కూల్ ప్రాజెక్ట్ కోసం ఓ యానిమేటెడ్ వీడియోను వియాన్ రూపొందించాడు. అందులో సోనూసూద్ హీరో.. ఆయన చేసిన సేవలను వియాన్ చూపించాడు. దాన్ని చూసిన శిల్పాశెట్టి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సమాజంలో జరిగే ప్రతి విషయాన్నీ చిన్నారులు కూడా గమనిస్తుంటారని, స్కూల్ ప్రాజెక్ట్ కోసం తన కుమారుడు వియాన్ చేసిన యానిమేటెడ్ వీడియో చూసి తాను చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పింది.
దేశంలో జరుగుతున్న విషయాలను వియాన్ గ్రహిస్తున్నాడని, తన స్నేహితుడు సోనూసూద్ చేసిన సేవలకు తన కుమారుడు వియాన్ చాలా ముచ్చటపడ్డాడని తెలిపింది. మనమంతా కరోనా మీద ఉన్న భయంతో ఇంట్లో కూర్చొన్న సమయంలో సోనూసూద్ మాత్రం ప్రజల బాధను పంచుకోవడం కోసం ధైర్యంగా ముందుకు వచ్చాడని పేర్కొంది.
వలస కార్మికుల కోసం సోను చేసిన సేవలు వియాన్ హృదయాన్ని తాకాయని చెప్పింది. వియాన్ సొంతంగా కథ రాసుకుని, డబ్బింగ్ చెప్పుకుని, ఎడిటింగ్ కూడా చేశాడని తెలిపింది. వియాన్ వర్క్ చూసి గర్వంగా భావిస్తున్నానని చెప్పింది.