Deepak Subramanian: ఫోన్ లో ఇళయారాజా సందేశాన్ని ముద్దాడిన ఎస్పీ బాలు... ఆసక్తికర అంశాలు వెల్లడించిన చెన్నై డాక్టర్

Chennai doctor Deepak Subramanian talks about SP Balasubrahmanyam

  • ఇటీవలే కన్నుమూసిన ఎస్పీ బాలు
  • బాలు చికిత్స అందించిన డాక్టర్ దీపక్ సుబ్రమణియన్
  • ఇలా జరుగుతుందని ఊహించలేదని వెల్లడి

వేల కొద్దీ పాటలను, అమృతాన్ని పంచే తన గానాన్ని జ్ఞాపకాలుగా మిగిల్చి గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో బాలుకు వైద్యం చేసిన డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు వెల్లడించారు. దీపక్ సుబ్రమణియన్ సుప్రసిద్ధ లేప్రోస్కోపిక్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సల నిపుణుడు.

ఎస్పీ బాలు గురించి చెబుతూ, కోలుకుంటున్న దశలో ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడడాన్ని తాము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని, డాక్టర్లుగా ఎంతో షాక్ కు గురయ్యామని అన్నారు. ఇలా జరుగుతుందన్నది తమ ఊహకందని విషయం అని పేర్కొన్నారు. అసలు, ఎస్పీ బాలుతో తన పరిచయం నుంచి అన్ని విషయాలను ఆయన వరుసగా వివరించారు.

"నా మిత్రుడు శశికుమార్ కు చెన్నైలో ఓ క్లినిక్ ఉంది. ఆరేళ్ల కిందట ఆ క్లినిక్ లోనే బాలు గారితో నాకు పరిచయం ఏర్పడింది. బాలు తనయుడు చరణ్ నాకు అంతకుముందే స్నేహితుడు. బాలు గారికి ఏవో ఆరోగ్య సమస్యలు ఉంటే నా మిత్రుడైన డాక్టర్ శశికుమార్ తో కలిసి ఆయనకు చికిత్స చేసి నయం చేశాం. అప్పటి నుంచి ఆయన ఎంతో సన్నిహితం అయ్యారు. తనకు తెలిసిన వాళ్లకు నా గురించి చెప్పేవారు. గ్యాస్ట్రిక్ సమస్యలుంటే నా వద్దకు వెళ్లమని చెప్పేవారు. నా ప్రతి పుట్టినరోజుకి ఓ పాటలో రెండు లైన్లు పాడి పంపించేవారు. అది నా అదృష్టంగా భావిస్తాను.

ఇటీవల ఆగస్టు 3వ తేదీ రాత్రి చరణ్ ఫోన్ చేసి నాన్న గారికి జ్వరంగా ఉందన్నాడు. బాలు గారిది పెద్ద వయసు కావడంతో కరోనా టెస్టులు చేస్తే బాగుంటుందని భావించాం. ఆ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. జ్వరం వంటి ఇతర లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేర్చమని సూచించాం. మొదట ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచాం. ఆ సమయంలో ఆయన పుస్తకాలు చదివేవారు, టీవీలో కార్యక్రమాలు, నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు, షోలు వీక్షించేవారు. అయితే శ్వాస సమస్యలు తలెత్తడంతో ఆయనను ఐసీయూకి తరలించాం.

కొన్ని రోజులు వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స జరిగాక ఆయన కోలుకున్నారు. పూర్తి స్పృహలోకి వచ్చారు. ఓ రోజు చరణ్ వచ్చి ఆయనకు వచ్చిన మెసేజులు అన్నీ చూపిస్తున్నారు. అయితే ఇళయరాజా సందేశాన్ని ఫోన్ లో చూసిన బాలు... చరణ్ ను ఇటువైపు రమ్మని సైగ చెప్పారు. చరణ్ ఆయనకు దగ్గరగా వెళ్లగా, నువ్వు కాదు ఫోన్ అంటూ సైగ చేసి, ఫోన్ అందుకుని ఇళయరాజా సందేశాన్ని ముద్దాడారు. ఆ క్షణాలు మా మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. ఇళయరాజా కాంబినేషన్లో ఆయన పాడిన పాటలు ఎక్కువగా వినిపించేవాళ్లం" అని డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ వివరించారు.

"ఎప్పుడైనా భార్య సావిత్రి, కుమార్తె పల్లవి, కుమారుడు చరణ్ వస్తే బాలు గారి ముఖం వెలిగిపోయేది. ఇక కోలుకుంటున్నారని భావించిన క్రమంలో కేవలం రెండ్రోజుల వ్యవధిలో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. శుక్రవారం నాడు సార్ చనిపోయారు. బుధవారం నుంచే ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తిచెందింది. ఆ ఇన్ఫెక్షన్ కు ఏ మందూ పనిచేయలేదు. మెదడులోనూ రక్తస్రావం జరిగింది. ఆ పరిస్థితిని 74 ఏళ్ల బాలు తట్టుకోలేకపోయారు.

చరణ్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. ఓ స్నేహితుడిగా, ఓ వైద్యుడిగా వ్యవహరించాల్సిన పరిస్థితి నా ముందు నిలిచింది. ఎక్మో ట్రీట్ మెంట్ సమయంలో ఏమైనా జరిగే అవకాశాలున్నాయని అతడికి వివరించాం. ఊపిరితిత్తుల మార్పిడి చేస్తే సార్ బతికేవాళ్లని కొందరు అన్నారు. కానీ మేం చేయగలిగిందంతా చేశామని చాలా మంది మద్దతు ఇచ్చారు. చరణ్ ఫ్యామిలీ మాపై విశ్వాసం ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత రెండ్రోజుల పాటు నేను ఏ కేసులూ చూడలేదు" అంటూ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News