Harish Rao: మహిళల పట్ల ఉత్తమ్ కుమార్ కు ఉన్న గౌరవం ఇదేనా?: హరీశ్ రావు
- సోలిపేట సుజాతకు సోదరుడిలా అండగా ఉంటానన్న హరీశ్
- సుజాత అసమర్థురాలని ఉత్తమ్ అనడం సరికాదని వెల్లడి
- ఉత్తమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
దుబ్బాక అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ సీటును ఇటీవలే మరణించిన సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకే సీఎం కేసీఆర్ ఖరారు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, భర్తను కోల్పోయిన సోలిపేట సుజాతకు ఓ సోదరుడిలా అండగా ఉంటానని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. అయితే, తనపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
ఓ సోదరుడిలా సుజాతకు సహకరిస్తానని తానంటే, ఆమె అసమర్థురాలు అంటూ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. మహిళలంటే ఉత్తమ్ కుమార్ దృష్టిలో ఎంత విలువ ఉందో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందని అన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడుతున్న ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు.
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంఘీభావ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎప్పుడూ కనిపించని వ్యక్తులు, నాయకులు ఇవాళ కనిపిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. తాను, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాబోయే శాసనసభ్యురాలు సుజాత అక్క ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజల పక్షానే ఉంటామని హరీశ్ రావు ఉద్ఘాటించారు.