Tree: అనుమతి లేకుండా ఇంటిముందు చెట్టు నరికివేత.. రూ.25 వేల ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ

GHMC fined a man who cut a tree without permission

  • ఎల్బీనగర్ లో తన ఇంటి ముందున్న చెట్టు నరికించిన వ్యక్తి
  • వీడియో తీసిన యువతి
  • మేయర్ కు సమాచారం అందించిన ఎంపీ సంతోష్

తెలంగాణలో కొన్నాళ్లుగా హరిత ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. హరితహారం ఓవైపు, గ్రీన్ ఇండియా చాలెంజ్ మరోవైపు... రాష్ట్రాన్ని పచ్చదనంతో కళకళలాడించే దిశగా నడిపిస్తున్నాయి. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ నిర్వహిస్తున్న తెలంగాణ సర్కారు ఒక్క చెట్టును అనవసరంగా నరికినా ఉపేక్షించడంలేదు. హైదరాబాద్ లోని ఓ వ్యక్తి ఇలాగే చెట్టు నరికితే జీహెచ్ఎంసీ అధికారులు భారీ జరిమానా వడ్డించారు.

నగరంలోని ఎల్బీ నగర్ ఎఫ్ సీఐ కాలనీకి చెందిన వ్యక్తి తన నివాసం ముందున్న చెట్టును నరికించాడు. అయితే, ఆ చెట్టు కొట్టేస్తుండడాన్ని మెట్ పల్లి సురభి అనే యువతి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ వీడియోకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ను కూడా ట్యాగ్ చేశారు. దాంతో సంతోష్ కుమార్ స్పందించి నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు సమాచారం అందించారు.

ఈ క్రమంలో బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ అధికారులను అప్రమత్తం చేయగా, వారు పరిస్థితిని సమీక్షించి చెట్టు నరికించిన వ్యక్తికి రూ.25 వేలు జరిమానా విధించారు. కాగా, తెలంగాణలో పట్టణాలు, గ్రామాల్లో సైతం చెట్లు కొట్టేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News