chris gayle: నిన్నటి మ్యాచ్‌లో గేల్ ఎందుకు ఆడలేదో చెప్పిన కుంబ్లే
- వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ గేల్‌ను పక్కనపెట్టిన పంజాబ్
- నిన్నటి మ్యాచ్ నుంచి చివరి క్షణంలో తప్పుకున్న గేల్
- ఫుడ్ పాయిజన్ కారణంగా కడుపునొప్పి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ను వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ పక్కనపెట్టడంపై ఆ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. కీలక సమయంలో గేల్‌ను బరిలోకి దింపుతామని జట్టు మొదట్లోనే ప్రకటించింది. ప్రస్తుతం ఆ జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ గేల్‌ను పక్కనపెడుతుండడంపై అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ను దింపుతారని భావించినా అతడిని మరోమారు బెంచ్‌కే పరిమితం చేశారు.
గేల్‌ను పక్కనపెట్టడంపై ఆ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. నిన్నటి మ్యాచ్‌లో నిజానికి గేల్ ఆడాల్సి ఉందని, కానీ ఫుడ్ పాయిజన్ కారణంగా దూరం కావాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. నిన్నటి మ్యాచ్ తుది జట్టులో గేల్ ఉన్నాడని, అయితే ఫుడ్ పాయిజన్ కారణంగా కడుపు నొప్పి రావడంతో చివరి నిమిషంలో తప్పుకున్నాడని కుంబ్లే వివరించాడు.
గేల్‌ను ఎందుకు దించలేదన్న టోర్నీ నిర్వాహకుల ప్రశ్నకు బదులిస్తూ కుంబ్లే ఈ విషయాన్ని వెల్లడించాడు. 2009 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గేల్ ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడాడు. 4,484 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 175 నాటౌట్. అలాగే, 326 సిక్సర్లు బాది ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు.