Kurnool District: ఏపీలో తొలి పైలెట్ ట్రైనింగ్ సెంటర్... కర్నూలులో ఏర్పాటు!
- దసరా నాటికి కర్నూలు విమానాశ్రయం
- మూడు సర్వీసులు నడిపించనున్న ట్రూ జెట్
- విజయవాడ, బెంగళూరు, విశాఖలకు విమానాలు
- ట్రయినింగ్ సెంటర్ కోసం త్వరలోనే బిడ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పైలెట్ శిక్షణా కేంద్రాన్ని కర్నూలు ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. కర్నూలు ప్రాంతం హైదరాబాద్ తో పాటు బెంగళూరు విమానాశ్రయాలకు దగ్గరగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వ విమానయాన సలహాదారు, ఏపీఏడీసీఎల్ (ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఎండీ భరత్ రెడ్డి వెల్లడించారు.
ట్రయినింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, దీంతో త్వరలోనే బిడ్లను పిలవాలని నిర్ణయించామని ఆయన అన్నారు. శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ సంస్థే స్వయంగా కల్పించుకోవాల్సి వుంటుందని, ఎయిర్ పోర్టు భూమిని వాడుకుంటున్నందుకు అద్దె కూడా కట్టాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇక కర్నూలు విమానాశ్రయాన్ని దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అనుమతుల కోసం చూస్తున్నామని అన్నారు. కేంద్ర అనుమతులు లభిస్తే, ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులకు ట్రూజెట్, తక్కువ టికెట్ ధరలతో మూడు సర్వీసులు ప్రారంభిస్తుందని భరత్ రెడ్డి తెలిపారు. తొలి దశలో పగటి పూట మాత్రమే సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 2 కిలోమీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్ వే సిద్ధమైందని, మొత్తం 970 ఎకరాల్లో ఈ విమానాశ్రయం ఉంటుందని వెల్లడించారు.