Jagan: దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
- అక్టోబరు 17 నుంచి దుర్గా నవరాత్రులు
- సీఎంను కలిసిన కనకదుర్గ ఆలయ వర్గాలు
- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఈ నెల 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలంటూ ఆలయ వర్గాలు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి సీఎం జగన్ కు ఆహ్వానం పలికాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు, ఆలయ ఈవో సురేశ్, అర్చకులు సీఎంను కలిశారు.
కాగా, సీఎం జగన్ మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముహూర్తం ఖరారైంది. ఈసారి కరోనా పరిస్థితుల ప్రభావం శరన్నవరాత్రులపైనా పడింది. 10 ఏళ్ల లోపు చిన్నారులను, 60 ఏళ్లు పైబడిన వారిని దర్శనానికి అనుమతించడంలేదు. నవరాత్రుల సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే దర్శనాలు చేసుకోవాలి.