RUDRAM: రుద్రమ్ సక్సెస్... మరో అత్యాధునిక క్షిపణిని పరీక్షించిన భారత్

DRDO test fires RUDRAM missile from Sukhoi Jet
  • శత్రుభీకర ఆయుధాలను పరీక్షిస్తున్న భారత్
  • బాలాసోర్ ఐటీఆర్ లో రుద్రమ్ ప్రయోగం
  • సుఖోయ్ నుంచి దూసుకెళ్లిన రుద్రమ్ క్షిపణి
ఇటీవల భారత్ అత్యాధునిక ఆయుధ సంపత్తిని పరీక్షించుకుంటోంది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమ్ములపొదిని మరింత బలోపేతం చేసుకుంటోంది. గత కొన్నినెలలుగా ఆయుధ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్ర రక్షణ శాఖ తాజాగా యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రమ్ ని విజయవంతంగా పరీక్షించింది. బాలాసోర్ ఐటీఆర్ కేంద్రం నుంచి ఓ సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా ప్రయోగించిన రుద్రమ్ క్షిపణి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసింది.

దేశీయంగా ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రుద్రమ్ మిస్సైల్ ను రూపొందించింది. రుద్రమ్ క్షిపణి ప్రత్యర్థుల గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న శత్రుదేశాల రాడార్లను గుర్తించి వాటిని స్తంభింపచేయగలదు. వైరి దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల లింకులను తెంచివేయగలదు.

భారత వాయుసేన పాటవాన్ని రుద్రమ్ క్షిపణి మరింత ఇనుమడింప చేస్తుందనడంలో సందేహంలేదు. ప్రస్తుతం దీన్ని సుఖోయ్-30 ఎంకేఐ విమానం నుంచి మాత్రమే ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో మిరేజ్-2000, జాగ్వార్, తేజాస్, తేజాస్ మార్క్-2 పోరాట విమానాలతో అనుసంధానించనున్నారు. ఈ ఎయిర్ టు గ్రౌండ్ తరహా మిస్సైల్ పరిధి 100 నుంచి 150 కిలోమీటర్లు.
RUDRAM
Anti Radiation Missile
Sukhoi-30
DRDO
India

More Telugu News