Nobel Peace Prize: ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి
- అనేక దేశాల్లో కొనసాగుతున్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్
- అంతర్యుద్ధాలతో రగిలే దేశాల ప్రజలకు ఆహారం అందజేత
- 'డబ్ల్యూఎఫ్ పీ'కి అవార్డు ప్రకటించిన నోబెల్ కమిటీ
ప్రపంచవ్యాప్తంగా నోబెల్ పురస్కారాలకు ఉండే విలువ ఎంతో ప్రశస్తమైనది. ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి గురించి చెప్పాలంటే, ఎంతో నిబద్ధతతో వ్యవహరించి శాంతికి నిజమైన రాయబారిగా వ్యవహరించినవాళ్లకే ఈ పురస్కారం దక్కుతుంది. ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందించే నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాదికి గాను ప్రపంచ ఆహార పథకానికి దక్కింది.
ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్ పీ) అంతర్యుద్ధాలతో రగిలే దేశాల్లో ఆకలిచావుల నివారణకు తోడ్పడుతోంది. అనేక ప్రపంచ దేశాల్లో మానవాళిని పట్టిపీడిస్తున్న ఆకలి సమస్యను పరిష్కరించే క్రమంలో ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం గణనీయమైన ఫలితాలు సాధించింది.
గతేడాది ఈ పథకం ద్వారా 88 దేశాల్లో వంద మిలియన్ల మందికి ఆహారం అందించినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ప్రపంచ ఆహార పథకం తన విస్తృతిని పెంచుకుని, మరింత మంది అన్నార్తుల కడుపు నింపినట్టు వివరించింది. అందుకే ఐక్యరాజ్యసమితి చేపడుతున్న ఈ ప్రపంచ ఆహార పథకానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.