Gunashekhar: గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' ప్రేమకావ్యం!
- ఆమధ్య గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి'
- 'హిరణ్య కశ్యప'ను పక్కన పెట్టిన వైనం
- బ్లాక్ అండ్ వైట్ లో మోషన్ పోస్టర్ విడుదల
కమర్షియల్ చిత్రాలను కూడా కళాత్మకంగా తీయగలడన్న పేరు పొందిన దర్శకుడు గుణశేఖర్. గతంలో తాను రూపొందించిన పలు చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడు ఆమధ్య తన రూటును మార్చి 'రుద్రమదేవి' చారిత్రాత్మక కథా చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారు.
ఈ క్రమంలో తన తదుపరి చిత్రంగా రానా దగ్గుబాటి టైటిల్ పాత్రధారిగా 'హిరణ్యకశ్యప' పేరిట పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటనలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ఆ 'హిరణ్యకశ్యప'ను పక్కనపెట్టి 'శాకుంతలం' పేరిట ఆయన ఓ ప్రేమకావ్యాన్ని రూపొందించడానికి రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన టైటిల్ ని, మోషన్ పోస్టర్ని ఈ రోజు ఆయన విడుదల చేశారు.
"వెండితెరపై 'హిరణ్య కశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ.." అని పేర్కొంటూ, గుణశేఖర్ ఈ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో శకుంతల పోట్రైట్ తో ఈ మోషన్ పోస్టర్ రమణీయంగా వుంది. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.