Vijayashanti: ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ అస్తవ్యస్తం: విజయశాంతి విమర్శలు
- ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ లోపభూయిష్టమన్న విజయశాంతి
- ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని వ్యాఖ్యలు
- కేసీఆర్ దొర పరిపాలన అటకెక్కించారని విమర్శలు
తెలంగాణలో ధరణి పేరిట ఆస్తుల ఆన్ లైన్ అంటూ ప్రారంభించిన నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా కొనసాగుతోందని, ఆ విషయం ప్రచార మాధ్యమాలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. సాంకేతిక సమస్యలు ఒకవైపు, శిక్షణలేని సిబ్బందితో మరోవైపు... చివరికి వేదన మాత్రం ప్రజలకు అంటూ ట్విట్టర్ లో స్పందించారు.
ఇప్పటికిప్పుడు పన్నులు చెల్లిస్తేనే ఆస్తులు ఆన్ లైన్ చేస్తామన్న హెచ్చరికలతో, ఎంతోకొంత ముట్టచెబితేనే కానీ నమోదు చేసుకోమనే బెదిరింపులతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.
అటు, ఇతర పరిస్థితులపైనా విజయశాంతి స్పందించారు. గాంధీలో, నిమ్స్ లో కరోనా యోధుల ధర్నాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయని, ఇవి చాలక డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల వెతలు, రైతుల ఆవేదన... ఇలా సమస్యలకు అంతేలేదని పేర్కొన్నారు.
మొత్తమ్మీద పాలకవర్గం తప్ప మరే వర్గం ప్రశాంతంగా లేని పరిస్థితులు నేడు తెలంగాణలో కనిపిస్తున్నాయని విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ దొరగారు పరిపాలనను అటకెక్కించి టీఆర్ఎస్ గెలుపు కోసం పూర్తిగా దుబ్బాక ఉప ఎన్నికపైనే దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గ్రహించడం మంచిది అని హితవు పలికారు.