Sanjay Raut: ఇది ఆరంభం మాత్రమే... త్వరలోనే అంతా బయటికి వస్తుంది: 'టీఆర్పీ స్కాం కేసు'పై సంజయ్ రౌత్
- ముంబయి పోలీసులపై రౌత్ ప్రశంసలు
- సాహసోపేతంగా వ్యవహరించారని కితాబు
- ముంబయి పోలీసులు పక్కా ప్రొఫెషనల్ అంటూ వ్యాఖ్యలు
టీఆర్పీ రేటింగ్ మెరుగ్గా ఉన్న టీవీ చానళ్లకు అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ పొందేందుకు రిపబ్లిక్ టీవీ చానల్ సహా మూడు టీవీ చానళ్లు అడ్డదారి తొక్కాయంటూ ముంబయి పోలీసులు ఓ భారీ కుంభకోణాన్ని వెలికి తీశారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
రూ.30 వేల కోట్ల విలువైన భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ముంబయి పోలీసుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ముంబయి పోలీసులు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని, అయితే, ఈ వ్యవహారంలో ముంబయి పోలీసులు కక్షసాధింపు, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ముంబయి పోలీసుల ప్రొఫెషనలిజాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు.
మహావికాస్ అగాఢీ సర్కారును అస్థిరపరిచేందుకు, ఉద్ధవ్ థాకరే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు ప్రతీకార ధోరణి కాదా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. టీఆర్పీ రేటింగ్ కుంభకోణం ఆరంభం మాత్రమేనని, మరికొన్నిరోజుల్లో మొత్తం బయటికి వస్తుందని వ్యాఖ్యానించారు.