Panchumarthi Anuradha: వీళ్లు వాలంటీర్లు కాదు.. వసూల్ రాజాలు: పంచుమర్తి అనురాధ

Volunteers are Vasul Rajas says Panchumarthi Anuradha

  • పింఛన్ కావాలన్నా వాలంటీర్ కు లంచం ఇవ్వాల్సి వస్తోంది
  • రూ. 10 వేలు ఇస్తేనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నారు
  • మద్య నిషేధం అంటే పిచ్చి బ్రాండ్లు తీసుకురావడమా?

తెలుగుదేశం పాలనలో రైతుల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా తయారయ్యారని... వైసీపీ హయాంలో లంచాలు తీసుకునే వాలంటీర్లుగా తయారయ్యారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, పింఛన్ కావాలన్నా వాలంటీర్ కు లంచం ఇవ్వాల్సిందేనని అన్నారు. వీళ్లంతా వాలంటీర్లు కాదని... వసూల్ రాజాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలను కూడా డేగల్లాగ పీక్కుతింటున్నారని అన్నారు.

డ్వాక్రా గ్రూపుల నుంచి యానిమేటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని... ఈ డబ్బును వైసీపీ నేతలతో పంచుకుంటున్నారని అనురాధ ఆరోపించారు. ఒక్కో డ్వాక్రా గ్రూపు నుంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారని చెప్పారు. రూ. 10 ఇస్తేనే ఒక మహిళ ఏ కులమో చెబుతూ ధ్రువీకరణ పత్రాన్ని వాలంటీర్ ఇస్తాడని విమర్శించారు.

మద్యపాన నిషేధమంటే పిచ్చిపిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలను దండుకోవడమేనా? అని మండిపడ్డారు. సెంటు పట్టా పథకం పేరుతో  ఏడాదికి రూ. 4 వేల కోట్లు, ఇసుక మాటున రూ. 5 వేల కోట్లు, జేట్యాక్స్ పేరుతో ఏడాదికి మరో రూ. 5 వేల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. అంబులెన్సుల నిర్వహణ పేరుతో రూ. 307 కోట్లు కొట్టేశారని తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో భారీ దోపిడీ చేస్తున్నారని... మున్సిపల్ ఏరియాల్లో అయితే రూ. 30 వేలు, రూరల్ ఏరియాలో అయితే రూ. 15 వేల చొప్పున వైసీపీ నేతలు లంచం తీసుకుంటున్నారని అన్నారు.

వైయస్సార్ ఆసరా కింద నిజమైన లబ్ధిదారులకు సాయం అందలేదని చెప్పారు. వృద్ధులకు పింఛన్ రావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద వైసీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారని అన్నారు. జలయజ్ఞంలో లక్షల కోట్లు కొల్లగొట్టారని... అందుకే జగన్ పై 11 ఛార్జిషీట్లు వేశారని ఎద్దేవా చేశారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గుర్తించాలని అన్నారు. లంచం అడిగితే జనాలు తిరగబడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పథకాలను కాపీ కొట్టి, పేర్లు మార్చి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చీఫ్ మినిస్టరా? లేక కాపీ మినిస్టరా? అని జనాలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News