CBSE: విద్యార్థులకు శుభవార్త... 50 శాతం తగ్గనున్న సిలబస్!
- కరోనా కారణంగా ఇంకా తెరచుకోని పాఠశాలలు
- ఇప్పటికే తగ్గిన 30 శాతం పాఠ్యాంశాలు
- మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయన్న అధికారులు
కరోనా మహమ్మారి కారణంగా, ఈ సంవత్సరం విద్యారంగం తీవ్ర స్థాయిలో ప్రభావితమైన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఇంతవరకూ పాఠశాలలు తెరుచుకోలేదు. ఇప్పటికే పాఠ్యాంశాల సిలబస్ ను 30 శాతం తగ్గించిన సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, మరో 20 శాతం... అంటే, మొత్తం 50 శాతం మేరకు సిలబస్ ను తగ్గించాలని నిర్ణయించింది. తీసేసిన పాఠ్యాంశాల నుంచి ఈ సంవత్సరం పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలూ ఉండబోవని స్పష్టం చేసింది.
విద్యార్థులు ఇంతవరకూ స్కూళ్లకు వెళ్లకపోవడం, ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పాఠశాలలు తిరిగి తెరచుకుంటాయన్న విషయమై స్పష్టత లేకపోడవంతో సిలబస్ ను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి మరింతకాలం పాటు అదుపులోకి రాకపోతే, 70 శాతం వరకూ సిలబస్ ను తగ్గించి, ఎంపిక చేసిన 30 శాతం పాఠ్యాంశాలతోనే ఈ విద్యా సంవత్సరాన్ని ముగించే ఆలోచనలో ఉన్నామని సీబీఎస్ఈ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో తుది నిర్ణయాన్ని త్వరలో జరిపే సమావేశం తరువాత తీసుకునే అవకాశాలు ఉన్నాయని, బోర్డు పరీక్షలు కూడా నెలన్నర నుంచి, రెండు నెలలు ఆలస్యంగా జరిపే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు 2021 ఏప్రిల్ లో జరగవచ్చని అంచనా వేశారు. కాగా, పాఠశాలలను తిరిగి తెరిచేందుకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ, మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా, ఇప్పట్లో స్కూళ్లు పూర్వపు స్థితికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.
ఇదే సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని స్కూళ్లను తెరిపించుకునే అవకాశాలు ఉన్నా, చాలా మంది తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు నిరాకరిస్తూ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.