France: ఫ్రాన్స్ లో ఢీకొన్న రెండు విమానాలు!
- పశ్చిమ ఫ్రాన్స్ లో ఘటన
- టూరిస్టులతో వెళుతున్న విమానాన్ని ఢీకొన్న చిన్న విమానం
- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఫ్రాన్స్ లో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. టూరిస్టులను తీసుకెళుతున్న విమానం ఒకటి మైక్రోలైట్ విమానాన్ని ఢీకొంది. ఈ ఘటన పశ్చిమ ఫ్రాన్స్ లో భారత కాలమానం ప్రకారం, శనివారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. ఇద్దరితో వెళుతున్న చిన్న విమానం ఒకటి, ముగ్గురు టూరిస్టులను తీసుకెళుతున్న డీఏ 40 విమానాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న అందరూ మరణించారని అధికారులు స్థానిక అధికారులు ప్రకటించారు. ప్రమాదం తరువాత మైక్రోలైట్ విమానం, ఓ ఇంటి ఫెన్సింగ్ పై పడగా, డీఏ 40 విమానం, దానికి కొన్ని వందల మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో కుప్పకూలింది. విషయం తెలిసిన వెంటనే 50 మంది ఫైర్ పైటర్లు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం గురించి లియాన్ ఎమర్జెన్సీ విభాగానికి తొలుత తెలిసిందని, వారు వెంటనే విమానాన్ని ట్రాక్ చేస్తూ వచ్చి, ప్రమాదస్థలిని గుర్తించారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని, విమానాల్లోని బ్లాక్ బాక్స్ ల కోసం గాలిస్తున్నామని తెలిపారు. దట్టమైన మేఘాల కారణంగానే ప్రమాదం జరిగి వుండవచ్చని భావిస్తున్నట్టు వెల్లడించారు.