Bharat Biotech: మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ పై లేటెస్ట్ అప్ డేట్స్!
- మూడవ దశ ప్రయోగాలు అతి త్వరలో
- భారీ ఎత్తున చేయనున్న భారత్ బయోటెక్
- 12 ఆసుపత్రుల్లో పరీక్షలు
కరోనాను దరిచేరనీయకుండా చేసేలా భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ సంయుక్తంగా తయారుచేస్తున్న కోవాగ్జిన్, మూడవ దశ ట్రయల్స్ ను భారీ ఎత్తున చేపట్టేందుకు డ్రగ్ నియంత్రణా సంస్థ అనుమతులను మంజూరు చేసింది. రెండో దశ ట్రయల్స్ లో భాగంగా చేసిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని భారత్ బయోటెక్ ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి భద్రత, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగిన విధానంపై పూర్తి సమాచారాన్ని కోరింది.
ప్రస్తుతం కోవాగ్జిన్ రెండో దశ ట్రయల్స్ ముగించుకుని, మూడవ దశలోకి ప్రవేశిస్తోంది. తమ వ్యాక్సిన్ అన్ని రకాల జంతువులపైనా సమర్థవంతంగా పనిచేసిందని, వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత వైరస్ ను ఇవి ఎదుర్కొన్నాయని పేర్కొంది. ఆపై దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రుల్లో కోవాగ్జిన్ ను మానవులపై పరీక్షించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వాలంటీర్లపై వ్యాక్సిన్ ను ప్రయోగించారు. హైదరాబాద్ సహా, రోహ్ తక్, పట్నా, కాంచీపురం, ఢిల్లీ, గోవా, భువనేశ్వర్, లక్నో తదితర ప్రాంతాల్లో ట్రయల్స్ జరిగాయన్న సంగతి తెలిసిందే.
గత వారంలో ట్రయల్స్ వివరాలతో భారత్ బయోటెక్ నివేదిక రూపొందించింది. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సాంకేతికత కోసం కాన్సాస్ కేంద్రంగా నడుస్తున్న విరోవ్యాక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. కరోనా పాథోజన్ లతో ఈ వ్యాక్సిన్ దీర్ఘకాలం పాటు పోరాడుతుందని భావిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎల్లా కృష్ణ తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న హై కంటెయిన్ మెంట్ ఫెసిలిటీలో వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ఇనాక్టివేటెడ్ కరోనా వైరస్ ను భారీ ఎత్తున తయారు చేస్తున్నట్టు తెలిపారు.