payal ghosh: సుశాంత్‌లా నేను చనిపోవాలని భావిస్తున్నారు..నా మృతి మిస్టరీగా మారిపోయేలా ఉంది: నటి పాయల్
- బాలీవుడ్ లోని కొందరు నన్ను అవమానించాలని చూస్తున్నారు
- వారి మాఫియా గ్యాంగ్ నన్ను చంపేస్తుంది
- నా చావుని ఆత్మహత్యగా ఆ గ్యాంగ్ చిత్రీకరిస్తుంది
- మోదీ, అమిత్ షా నాకు సాయం చేయాలి
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నటి పాయల్ ఘోష్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. ఈ విషయంలో నటి రిచాచద్దా పేరును కూడా ఆమె లాగుతూ ఆమెపై కూడా పలు ఆరోపణలు చేసింది. అయితే, పాయల్ ఆరోపణలతో తన మర్యాదకి భంగం వాటిల్లిందని రిచాచద్దా బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అనురాగ్ కశ్యప్ గురించి ఆరోపణలు చేసే సమయంలో తన పేరుని ఉద్దేశపూర్వకంగానే పాయల్ బయటపెట్టిందని ఆమె చెప్పింది. ఈ పరిణామాల ఈ నేపథ్యంలో పాయల్ ఘోష్ తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ట్వీట్ చేసింది. మాఫియా గ్యాంగ్ తనని చంపేస్తారని, దయచేసి తనకి సాయం చేయాలని ఆమె ప్రధానిని కోరింది.
అలాగే రిచా చద్దా గురించి ఆమె స్పందిస్తూ ‘నిజాలు బయటకు రాకుండా నిన్ను కావాలనే ఈ ఫిర్యాదులో భాగం చేశానని ఎలా చెప్పగలరు? కశ్యప్ గురించి మీరు అంత నమ్మకంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు?’ అని ఆమె ప్రశ్నించింది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ దీని గురించి ఒక్కసారి ఆలోచించాలని, బాలీవుడ్ లోని కొందరు తనను అవమానించాలని చూస్తున్నారని చెప్పింది.
సుశాంత్‌లా తాను కూడా చనిపోవాలని వాళ్లు భావిస్తున్నారని, అందుకే ఇప్పటివరకూ తన ఫిర్యాదుకి సమాధానం ఇవ్వలేదని తెలిపింది. బాలీవుడ్‌లోని ఇతర సెలబ్రెటీల్లా తన మృతి కూడా ఓ మిస్టరీగా మారిపోయేలా ఉందని ఆమె చెప్పింది. వారి మాఫియా గ్యాంగ్ తనను చంపేస్తుందని, తన చావుని ఆత్మహత్యగా ఆ గ్యాంగ్ చిత్రీకరిస్తుందని ఆమె చెప్పింది. ప్రధానితో పాటు కేంద్రమంత్రి అమిత్ షా తనకు సాయం చేయాలని ఆమె కోరింది.