Severe Depression: బంగాళాఖాతంలో మరింత బలపడనున్న వాయుగుండం... ఏపీలో భారీ వర్షాలు

Severe depression in Bay Of Bengal

  • బంగాళాఖాతంలో వాయుగుండగా మారిన అల్పపీడనం
  • రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
  • హెచ్చరికలు చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం నరసాపురం, విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు, రేపు తీరం వెంబడి గాలుల వేగం 70 కి.మీ వరకు ఉండొచ్చని, సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన పిమ్మట, ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వివరించారు. అటు తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News