Yogesh Bhattarai: నాడు తమ దేశంలో కరోనా లేదన్న నేపాల్ మంత్రికి ఇప్పుడు పాజిటివ్!
- నేపాల్ లోనూ కరోనా
- ప్రధాని సన్నిహితుల్లో కరోనా కలకలం
- వ్యక్తిగత డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్
కరోనా రక్కసి సర్వాంతర్యామిలా వ్యాపిస్తూనే ఉంది. వేళ్ల మీద లెక్కించగలిగిన దేశాల్లో తప్ప 200లకు పైగా దేశాల్లో ఇది విజృంభిస్తోంది. భారత్ పొరుగున ఉన్న నేపాల్ లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. తాజాగా నేపాల్ టూరిజం మంత్రి యోగేశ్ భట్టారాయ్ కి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యోగేశ్ భట్టారాయ్ నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గతంలో యోగేశ్ రాయ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానిస్తూ నేపాల్ ను కరోనా రహిత దేశమంటూ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడాయనే కరోనా బారినపడడం విధి వైచిత్రి. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
అటు, ప్రధాని కేపీ శర్మ ఓలి సన్నిహితుల్లో చాలామంది కరోనా బారినపడ్డారు. వారిలో ఆయన డాక్టర్ కూడా ఉన్నారు. మీడియా వ్యవహారాల నిపుణుడు, ఫొటోగ్రాఫర్ కూడా వీరిలో ఉన్నారు. దాంతో ప్రధాని కోసం అత్యంత కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.