Ameerpet: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. భార్య తరపు బంధువులపై అనుమానం

Software engineer killed in Hyderbaba Ameerpet
  • అమీర్‌పేట ధరమ్ కరణ్ రోడ్డులోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఘటన
  • ఈ ఏడాది జూన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాధితుడి భార్య
  • ఈ కేసులో ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన బాధితుడు
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ధరమ్ కరణ్ రోడ్డులో అతడు ఉంటున్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఈ హత్య జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్ (25), మచిలీపట్టణానికి చెందిన లక్ష్మీగౌరి (22) భార్యాభర్తలు. గతేడాది ఫిబ్రవరి 23న వీరికి వివాహమైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు ఆల్విన్ కాలినీలో భార్యతో కలిసి జీవిస్తుండగా, ఈ ఏడాది జూన్1న లక్ష్మీగౌరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

భర్త, అత్తమామల వేధింపుల వల్లే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చాడు. దాంతో రాజు ప్రతి వారం బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండడంతో గత 40 రోజులుగా ధరమ్ కరణ్ రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లో నివసించే మేనమామ వద్ద ఉంటున్నాడు.

రాజు నిన్న ఉదయం అతడు చికెన్ కోసం అపార్ట్‌మెంట్‌ నుంచి కిందికి వచ్చాడు. అక్కడి సెల్లార్‌లో అప్పటికే మాటువేసిన నలుగురు నిందితులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యవెనక చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీగౌరి బంధువుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Ameerpet
Hyderabad
Software engineer
murder

More Telugu News