Corona Virus: నెలలో రూ. 50 పెరిగిన చికెన్ ధర.. వినియోగం పెరగడమే కారణం
- కిలో చికెన్ ధర గరిష్ఠంగా రూ. 260కి చేరిక
- కరోనా నేపథ్యంలో పెరిగిన అమ్మకాలు
- పెంపు తాత్కాలికమేనంటున్న వ్యాపారులు
కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చికెన్, గుడ్లు తినాలంటూ జరుగుతున్న ప్రచారంతో వాటి ధరలు కొండెక్కుతున్నాయి. తెలంగాణలో గత నెలతో పోలిస్తే ఈసారి కిలో చికెన్‌పై ఏకంగా రూ. 50 పెరిగి రూ. 260కి చేరుకుంది.
ప్రస్తుతం చికెన్ వినియోగం విపరీతంగా పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కరోనాకు ముందు వారానికి ఓసారి మాత్రమే చికెన్ కొనేవారు. కానీ ప్రస్తుతం వారానికి రెండుమూడుసార్లు చికెన్ తింటున్న కుటుంబాల సంఖ్య పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణలో రోజుకు సగటున 1.80 కోట్ల గుడ్డు అమ్ముడుపోయేవి. ప్రస్తుతం రోజుకు 2 కోట్ల వరకు అమ్ముడుపోతున్నాయి. గుడ్డు ధర కూడా నిన్నమొన్నటి వరకు రూ. 5 గా ఉండగా, ప్రస్తుతం రూ. 6కు చేరుకుంది. అయితే, ఈ పెంపు తాత్కాలికమేనని అంటున్నారు.