Rhea Chakraborty: రియాపై సంచలన ఆరోపణలు చేసిన పక్కింటి యువతి... సీబీఐకి ఆధారాలు ఇవ్వడంలో విఫలం!

CBI Warning To Rhea Neighbour not Spread False Claims

  • ఆత్మహత్యకు ఒకరోజు ముందు సుశాంత్ తో రియా
  • తాను చూశానని మీడియా ముందు చెప్పిన యువతి
  • ఆపై చూడలేదని సీబీఐ అధికారులకు వెల్లడి
  • హెచ్చరించి పంపిన అధికారులు
  • చర్యలకు రియా న్యాయవాది డిమాండ్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించడానికి ఒక్క రోజు ముందు అతన్ని రియా చక్రవర్తి కలిసిందని సంచలన ఆరోపణలు చేసిన పొరుగింటి యువతి, సీబీఐ విచారణలో తన ఆరోపణలపై ఆధారాలను అందించడంలో విఫలమైంది. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాపించేలా మాట్లాడవద్దని ఆమెను హెచ్చరించారు.

సుశాంత్ మరణం తరువాత, మీడియా ముందుకు వచ్చిన ఆమె, ముందురోజు కూడా ఇద్దరూ కలిసే వున్నారని వ్యాఖ్యానించి, కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఒక్కరే కాదు... రియాపై చాలా మంది ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారందరి జాబితాను తయారు చేస్తున్న రియా తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే, అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన సతీశ్, "టీవీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సుశాంత్, తన క్లయింట్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన, తప్పుడు ఆరోపణలు చేసిన అందరి జాబితానూ సీబీఐకి అందించనున్నాం. వీరందరూ విచారణను తప్పుదారి పట్టించి, మా క్లయింట్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అందరినీ విచారించి చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరనున్నాం" అని తెలిపారు.

కాగా, జూన్ 14న సుశాంత్, ముంబైలోని తన అపార్టుమెంట్ లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి ఆత్మహత్యే కారణమని, మరే ఇతర అనుమానిత ఆధారాలు లభించలేదని ఢిల్లీ ఎయిమ్స్ సైతం తేల్చి చెప్పింది. జూన్ 13న రియా వద్దకు సుశాంత్ వచ్చాడని, రియా పొరుగునే ఉండే యువతి క్లయిమ్ చేయగా, ఆమె వ్యాఖ్యలు పలు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఆపై సీబీఐ విచారణలో తాను జూన్ 13న సుశాంత్ ను చూడలేదని స్పష్టం చేయడంతో, ఆమెపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ కేసు ట్రయల్స్ లో మీడియా పాత్రను సైతం కోర్టు నిశితంగా గమనిస్తోందని చెప్పిన రియా న్యాయవాది సతీశ్, సుశాంత్ కు రియానే డ్రగ్స్ అందించిందని అతని కుటుంబీకులు చేసిన ఆరోపణలపైనా, సీబీఐ విచారించాలని కోరనున్నామని అన్నారు. ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రియాను అరెస్ట్ చేయగా, దాదాపు నెల రోజుల తరువాత ఆమె బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News