Corona Virus: కరోనా కారణంగా వాసన గ్రహించే శక్తిని కోల్పోయే వారికి ప్రమాదం లేదట!
- ఆరోగ్యం విషమించడం లేదు
- త్వరగా కోలుకుంటున్నారు
- వెల్లడించిన పరిశోధకులు
కరోనా సోకిన వారి లక్షణాల్లో ఒకటైన వాసన కోల్పోవడం మంచిదేనని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. వైరస్ సోకిన తరువాత కొందరు రోగులు సగటున 5 రోజులకు వాసన చూసే శక్తిని కోల్పోతున్నారని, అలా జరిగిన వారిలో ఆరోగ్యం విషమించడం లేదని, పైగా వారు త్వరగా కోలుకుంటున్నారని ఇరాన్ లోని టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ కు చెందిన సంస్థలు కూడా తేల్చాయి. ఈ అధ్యయనాల వివరాలు జామా జర్నల్ తాజా సంచికలో వెలువడ్డాయి.
కరోనా సోకిన 207 మందిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు, వీరిలో 179 మంది నెల రోజుల వ్యవధిలోనే పూర్తిగా కోలుకున్నారని, వాసన కోల్పోయిన వారిలో తొలుత తలనొప్పి, జలుబు, ఆపై తెల్ల రక్తకణాలు తగ్గడాన్ని గుర్తించామని తెలిపారు. 58 శాతం మందిలో ఇవే తొలి లక్షణాలని, మరో 42 శాతం మందికి వేరే లక్షణాలు కనిపించాయని తెలిపారు. వాసన కోల్పోవడం ఎంత వేగమో, తిరిగి ఆ శక్తి రావడం కూడా అంతే వేగంగా ఉందని తెలిపారు.
ఘ్రాణ శక్తిని కోల్పోయిన వారు త్వరగా రికవర్ అవుతున్నారని, గొంతులో గరగర ఉంటే, వాసన త్వరగా కోల్పోవడం జరుగుతుందని, వాసనకు కారణమైన నరాలపై వైరస్ దాడి చేస్తోందని, అదే దగ్గు, తుమ్ములు తదితర లక్షణాలుంటే వాసన త్వరగా కోల్పోవడం లేదని తేల్చారు.
ఇదే అధ్యయనంపై స్పందించిన భారత వైద్య నిపుణులు, స్మెల్ లాస్ అయిన వారు వైరస్ నుంచి త్వరగా కోలుకుంటున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇదే సమయంలో వాసన కోల్పోనివారిలో ఆరోగ్యం విషమిస్తుందని చెప్పలేమని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి, ఇతర వ్యాధులు కూడా ఉన్న వారిలో కరోనా ప్రభావం అధికమని అన్నారు.