Tirumala: 16 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఎలా నిర్వహించాలన్న విషయమై సమాలోచనలు!

Crucial Desission on BRahmotsavams today or Tomorrow

  • ఇటీవల ఏకాంతంగా జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • 16 నుంచి 24 వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు
  • మాడ వీధుల్లో వాహన సేవలపై ఆలోచన
  • భక్తులను అనుమతించే విషయమై రాని స్పష్టత

గత నెలలో అధికమాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ నెలలో జరగాల్సిన నవరాత్రి బ్రహ్మోత్సవాల విషయంలో మాత్రం ఎలా నిర్వహించాలన్న విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

ఈ బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలా? లేక మాడ వీధుల్లో నిర్వహించాలా? అన్న సమస్య ఇప్పుడు పట్టుకుంది. టీటీడీ నూతన ఈఓగా రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి, ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు పలువురు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.

వాస్తవానికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 16న ప్రారంభమై, 24 వరకూ జరగాల్సి వుంది. ఈ ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలన్న ఆలోచనతో ఆలయం చుట్టూ ఉన్న గ్యాలరీల్లో భక్తులు కూర్చోవాల్సిన స్థానాలను నిర్దేశిస్తూ, మార్కింగ్స్ కూడా వేశారు. ఈ పనులను పరిశీలించిన ఈఓ, ఆపై భౌతికదూరం అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. తనకు సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు కూడా.

అయితే, కరోనా ఇంకా నియంత్రణలోకి రాని ఈ పరిస్థితుల్లో, వాహన సేవలను మాడ వీధుల్లో భక్తుల మధ్య నిర్వహించడం ప్రమాదకరమని, ఎవరిలోనైనా వైరస్ ఉంటే, అది ఎంతో మందికి సోకే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో భక్తులు లేకుండా, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అన్ని పరిస్థితులనూ సమీక్షించిన తరువాత, బ్రహ్మోత్సవాల నిర్వహణపై నేడో, రేపో ఓ నిర్ణయానికి టీటీడీ రానుందని సమాచారం.

  • Loading...

More Telugu News