Rajnath singh: చైనా, పాకిస్థాన్‌లు ఓ ‘మిషన్’లో భాగంగానే వివాదాలు సృష్టిస్తున్నాయి: రాజ్‌నాథ్ అనుమానం
- సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో 44 వంతెనలను ప్రారంభించిన రాజ్‌నాథ్
- ఓ పథకం ప్రకారమే చైనా, పాక్‌లు వివాదం సృష్టిస్తున్నాయని ఆరోపణ
- అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటున్నామన్న మంత్రి
సరిహద్దులో చైనా కయ్యానికి కాలు దువ్వుతుండడంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్‌లు ఓ పథకం (మిషన్) ప్రకారమే వివాదాలు సృష్టిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో నిర్మించిన 44 వంతెలను రాజ్‌నాథ్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా, పాకిస్థాన్‌తో భారత్ 7 వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోందని అన్నారు. తూర్పు, ఉత్తర దిశల నుంచి పాకిస్థాన్, చైనాలు ఒక పథకం ప్రకారం వివాదాలు సృష్టిస్తున్నట్టు అనుమానంగా ఉందన్నారు. ఓవైపు కరోనా మహమ్మారి, మరోవైపు పాకిస్థాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూనే దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన వంతెనలతో వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు.