Hyderabad: వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారు నగలు!

gold jewellery bag washed away in flood water in Hyderabad

  • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘటన
  • రాత్రి పొద్దుపోయేంత వరకు వెతికినా ఫలితం శూన్యం
  • సేల్స్‌మన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

బైక్‌పై తీసుకెళ్తున్న కిలోన్నర బంగారు ఆభరణాలు వరదనీటిలో కొట్టుకుపోయిన ఘటన హైదరాబాద్ ‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కొనుగోలుదారుడి కోసం కిలోన్నర బంగారు ఆభరణాలను పంపాలన్న కోరికపై బషీర్‌బాగ్‌లోని వీఎస్ గోల్డ్ షాపు యజమాని, జూబ్లీహిల్స్‌లోని కృష్ణ పెరల్స్‌కు ఆ మొత్తం నగలను సేల్స్‌మన్ ప్రదీప్‌కు ఇచ్చి శనివారం ఉదయం పంపాడు. వాటితో పని పూర్తికావడంతో అదే రోజు సాయంత్రం తిరిగి దుకాణానికి వచ్చిన ప్రదీప్ ఆ నగల సంచిని తీసుకుని తన స్కూటర్‌పై బయలుదేరాడు. ఆభరణాల మూటను తన కాళ్ల దగ్గర పెట్టుకున్నాడు.

అప్పటికే వర్షం కురుస్తున్నప్పటికీ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 3 మీదుగా బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక కిడ్స్ స్కూలు వద్ద వరద రావడంతో అందులో ఆభరణాల సంచి కొట్టుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న దుకాణ యజమానితోపాటు మరో 15 మంది అక్కడకు చేరుకుని రాత్రి పొద్దుపోయేంత వరకు వెతికారు. చివరికి బ్యాగు దొరికినా అందులోని నగలు కనిపించకపోవడంతో హతాశులయ్యారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సేల్స్‌మన్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News