KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేటీఆర్
- జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణల కోసం సమావేశాలు
- హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అవకాశం
- జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సర్కారు
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉండడంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... దీని ద్వారా మొత్తం 5 సవరణలు చేస్తున్నామని వివరించారు. 2015లోనే జీవో ద్వారా జీహెచ్ఎంసీలో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించామని అన్నారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత టీఆర్ఎస్ దేనని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు దూసుకుపోతోందని ఆయన చెప్పారు.
1955లోనే హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలపాలని గత ప్రభుత్వాలు ఎప్పుడూ భావించలేదని విమర్శించారు. రాష్ట్రంలో హరిత వనాలు పెంచేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 శాతం పచ్చదనం పెరిగిందని ఆయన తెలిపారు.