Ambati Rambabu: సీజేఐకి సీఎం జగన్ లేఖ రాస్తే తెలుగు మీడియా ఇదసలు వార్తే కాదన్నట్టు వ్యవహరించింది: అంబటి ధ్వజం
- సుప్రీంకోరు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ లేఖ
- ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, లేఖను చదివిన అజేయకల్లాం
- ఈ వార్తను కొన్ని మీడియా సంస్థలు తొక్కిపెట్టాయన్న అంబటి
ఏపీ సీఎం జగన్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారన్న వార్త విపరీతమైన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు అజేయకల్లాం ఇటీవల ఓ ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహించారని, దానికి అన్ని పత్రికలు, చానెళ్ల ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు. కానీ ఆ ప్రెస్ మీట్ ను కొన్ని చానళ్లు ప్రసారం చేయలేదని అంబటి ఆరోపించారు. అది విషయమే కాదన్నట్టు కొన్ని పత్రికలు ఆ వార్తను తీసుకురాలేదని అన్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ రాసిన లేఖను ఆ ప్రెస్ మీట్ లో అజేయ కల్లాం చదివారని వెల్లడించారు. అసలా అంశాన్ని జాతీయ పత్రికలు, చానెళ్లు అన్నీ ప్రధాన వార్తగా కవర్ చేశాయని, మన తెలుగు మీడియా మాత్రం అది వార్తే కాదన్నట్టుగా వ్యవహరించిందని విమర్శించారు. ముఖ్య వార్తగా భావించినదాన్ని ఎందుకు నొక్కేస్తున్నారని అంబటి ప్రశ్నించారు.
ఓ రెండు పత్రికలు ఈ వార్తను పైకి రానివ్వకుండా నొక్కేస్తున్నాయని, దీని వెనుక ఏం కుట్ర దాగి ఉంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కొన్ని మీడియా సంస్థలు ఇలాగే చేసినా, ఎలాంటి నష్టం చేయలేకపోయాయని వెల్లడించారు.
"సుప్రీంకోర్టు సీజేఐకి సీఎం జగన్ లేఖ రాయడం మీకు నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ఓ వర్గం మీడియా ఆ న్యూస్ వేయకపోవడం పత్రికాస్వేచ్ఛ అవుతుందా? మీడియా పేరు చెప్పుకుని కుట్రలు చేసే ఆ పత్రికల్ని చదవాలా..? వార్త రాయరు కానీ, మరుసటి రోజు చర్చ నిర్వహిస్తారు. చంద్రబాబుకు కోపం వస్తుందని వార్తను దాచి పెడుతున్నారా? ఒక వర్గాన్ని కాపాడడం కోసమో, చంద్రబాబును కాపాడడం కోసమో రాయడం అయితే అది పత్రికాస్వేచ్ఛ అనిపించుకోదు" అంటూ అంబటి ధ్వజమెత్తారు.