Hyderabad: అత్యంత ప్రమాదకరస్థాయికి హుసేన్ సాగర్!
- నిన్నటి నుంచి నగర పరిధిలో భారీ వర్షం
- వరద నీటితో నిండిపోయిన జలాశయం
- గేట్లను ఎత్తాలని నిర్ణయించిన అధికారులు
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ జలాశయంలో నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాదాపు సగం నగరంలో కురిసే వర్షమంతా హుసేన్ సాగర్ జలాశయానికి, అక్కడి నుంచి మూసీ నదిలోకి వెళుతుందన్న సంగతి తెలిసిందే.
గత వారంలో కురిసిన వర్షాలకే జలాశయం పూర్తిగా నిండిపోగా, నిన్న ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా భారీ వరదగా హుసేన్ సాగర్ లోకి వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం గేట్లను ఎత్తాలని నిర్ణయించిన జలమండలి అధికారులు, లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.