Raghu Rama Krishna Raju: అచ్చెన్నాయుడికో న్యాయం, మీ మంత్రులకో న్యాయమా?: సీఎం జగన్ పై రఘురామకృష్ణరాజు విసుర్లు

MP Raghurama Krishnaraju fires CM Jagan and YCP Government

  • అనారోగ్యానికి గురైన అచ్చెన్నను ఇబ్బంది పెట్టారన్న రఘురామ
  • మంత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నారని విమర్శలు
  • సీఎం అందరినీ ప్రేమగా చూసుకోవాలని హితవు
  • విజయసాయిరెడ్డికీ చురక

ఏపీ సీఎం జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత అచ్చెనాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నా, కనికరించక ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, కానీ వైసీపీ మంత్రులు అనారోగ్యానికి గురైతే వారిని హెలికాప్టర్లలో పొరుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడికి ఓ న్యాయం, మీ మంత్రులకు మరో న్యాయమా? అంటూ మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకుని, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుంటే దారుణంగా వ్యవహరించారని, ఆపై ఆయనకు కరోనా సోకితే ప్రైవేటు ఆసుపత్రికి పంపకుండా అడ్డుకున్న నీచ సంస్కృతి ఈ ప్రభుత్వానిదని విమర్శించారు.

"ఇక్కడ ఆసుపత్రుల్లేవా? అంటూ నాడు మా విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యానించారు. అసలీ జగనన్న వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మిన్నగా ఉన్నాయి.. అది బాబుకు కనిపించడంలేదా? అని పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టిన ఆయనకే కరోనా వస్తే అపోలో ఆసుపత్రికి వెళ్లారు. శ్రీనివాసరెడ్డికి కరోనా వస్తే అపోలోనే. పెద్దిరెడ్డికి కరోనా వచ్చినా అపోలోనే. ఇప్పుడు సుబ్బారెడ్డికి కరోనా వస్తే అపోలోకి వెళ్లారు. మరి ఇక్కడ మీ ఉత్తమ వైద్యం ఎక్కడండీ విజయసాయిరెడ్డి గారూ... ముఖ్యమంత్రిగారు ఏర్పాటు చేసిన గొప్ప వైద్యం చేయించుకునేందుకు ఎవడున్నాడు ఇక్కడ?

కొట్టు సత్యనారాయణకు అనారోగ్యం వస్తే బెంగళూరు వెళ్లారు. పిఠాపురం ఎమ్మెల్యేకి ఇబ్బంది వస్తే ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు వెళ్లారు. చెల్లుబోయిన వేణుగారిని కూడా హెలికాప్టర్ లో తరలించారని తెలిసింది గానీ ఈ విషయం బయటికి రాలేదు. జగనన్న ఆసుపత్రి పథకాలన్నీ ఏమైపోయాయి? అచ్చెన్నాయుడి గారికి ఓ న్యాయం, మీ మంత్రులకు ఓ న్యాయమా? మీరసలు మనుషులేనా?

ఇక్కడ ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్ దొరకదు కానీ, మీ మంత్రులను మాత్రం హెలికాప్టర్లు ఇచ్చి ఎక్కడికంటే అక్కడికి తరలిస్తారు. మీ మంత్రులను ప్రేమగా చూసుకుంటే తప్పులేదు. ప్రజలను కూడా ప్రేమగా చూసుకోవాలి. అరగంటలో బెడ్ దొరక్కపోతే నేను ఊరుకోను... అంటూ ఉత్తినే స్టేట్ మెంట్లు ఇవ్వడం కాదు. అరగంట కాదు, అసలు నాలుగు రోజులైనా బెడ్ లు దొరక్క జనాలు చచ్చిపోతున్నారు" అంటూ రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News