Corona Virus: కరోనా నుంచి కోలుకున్న వారిలో 7 నెలల వరకు యాంటీబాడీలు.. తాజా అధ్యయనం వెల్లడి
- అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త దీప్తా భట్టాచార్య పరిశోధన
- దీప్తా నేతృత్వంలో అధ్యయనం చేసిన అరిజోనా వర్సిటీ పరిశోధకులు
- 6,000 మందిపై కొన్ని నెలలపాటు పరిశోధన
- యాంటీబాడీలు విడుదలయ్యే తీరుపై అధ్యయనం
కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీ (ప్రతిరక్షకాలు)ల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పరిశోధకులు.. కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు మూడు నెలల పాటు ప్రతిరక్షకాలు ఉంటాయని చెప్పారు.
అయితే, అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త దీప్తా భట్టాచార్య కొత్త విషయాన్ని గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సుమారు ఐదు నుంచి ఏడు నెలలపాటు యాంటీబాడీలు ఉంటాయని, మళ్లీ కరోనా సోకకుండా అవి కాపాడతాయని చెప్పారు.
దీప్తా భట్టాచార్య నేతృత్వంలో అరిజోనా వర్సిటీ పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనంలో భాగంగా ఈ ఫలితాలు తేలాయి. పరిశోధనలో భాగంగా వీరు.. కరోనా నుంచి కోలుకున్న 6,000 మందిలో కొన్ని నెలలపాటు యాంటీబాడీలు విడుదలయ్యే తీరుపై అధ్యయనం చేశారు. కొందరిలో గరిష్ఠంగా రెండేళ్ల వరకు కూడా ఆ వ్యాధినిరోధకత ఉంటుందని అంచనా చేశారు.