India: టూరిస్టు వీసాపై వెళ్లి.. దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 50 మంది భారతీయులు
- వీసా నిబంధనలు పాటించకపోవడంతో అడ్డుకున్న అధికారులు
- ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించిన భారత రాయబార కార్యాలయం
- 300 మంది పాకిస్థానీలు కూడా నిర్బంధం
పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లిన 50 మంది భారతీయులు అక్కడి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి నుంచి విమానాశ్రయంలో వీరు పడిగాపులు కాస్తున్నారు. పర్యాటక వీసాదారులు దేశంలో ప్రవేశించేందుకు అవసరమైన వీసా నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు వీరిని అక్కడే అడ్డుకుని నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం వీరికి ఆహారం అందించడంతోపాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసింది. భారత్‌తోపాటు మొత్తం 34 దేశాల పౌరులను తమ దేశంలోకి నేరుగా ప్రవేశించకుండా కువైట్ ఇటీవల నిషేధం విధించింది. దీంతో చాలామంది భారతీయులు, ఇతర దేశాలకు చెందినవారు విజిటింగ్ వీసాలపై తొలుత దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి కువైట్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే దుబాయ్ చేరుకున్న 50 మంది భారతీయుల వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడంతో అక్కడి అధికారులు అడ్డుకున్నారు. భారత్‌తోపాటు పాకిస్థాన్‌కు చెందిన 304 మంది కూడా పర్యాటక వీసాపై వచ్చి దుబాయ్‌లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. కాగా, విమానాశ్రయంలో చిక్కుకుపోయిన వారిలో 14 మంది భారతీయులను ఆ తర్వాత అనుమతించినట్టు ‘ఖలీజ్ టైమ్స్’ తెలిపింది.