Sabbam Hari: జమిలి ఎన్నికల నాటికి వైసీపీ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఉండకపోవచ్చు: సబ్బం హరి
- వచ్చే ఏడాది ప్రారంభంలో జగన్ కేసుల్లో తీర్పులు వస్తాయి
- ఆ తర్వాత బీజేపీ పెత్తనం చలాయిస్తుంది
- 150 మంది ఎమ్మెల్యేలున్నా వైసీపీని డమ్మీ చేస్తారు
ఓ టీవీ టిబేట్ లో మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ఉన్న కేసుల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో కాని, మధ్యలో కానీ తుది తీర్పులు వెలువడే అవకాశం ఉందని చెప్పారు. నాలుగు కేసులు బలంగా ఉన్నట్టు చెపుతున్నారని అన్నారు. వచ్చే ఏడాది 2021 చివరకు గానీ, 2022 ప్రథమార్థంలో గానీ జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... ఆ సమయానికి వైసీపీ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఉండకపోవచ్చనే విషయం తనకు తెలిసిందని చెప్పారు.
ఒకవేళ జగన్ కు శిక్ష పడితే... ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నకు బదులుగా సబ్బం హరి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీని బీజేపీ డమ్మీ చేస్తుందని... బీజేపీ కనుసన్నల్లో వైసీపీ నేతలంతా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు.
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కు దినకరన్ మద్దతు ఇవ్వాలని అనుకున్నారని... అదే జరిగుంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేవారని, కానీ ఆ ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుందని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో బీజేపీ నడిపిస్తోందని తెలిపారు.
ఈ విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై తనతో స్వయంగా చెప్పారని... తమిళనాడును బీజేపీ శాసిస్తోందని బాధపడ్డారని చెప్పారు. ఏపీలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తుందని అన్నారు. అయితే, వైసీపీ నుంచి సీఎం ఎవరవుతారనే విషయాన్ని కోర్టు తీర్పు వెలువడిన తర్వాత చెపుతానని వ్యాఖ్యానించారు. ఎవరు సీఎం అయినా బీజేపీ చెప్పినట్టే వినాల్సి ఉంటుందని అన్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ రాసిన లేఖను బయటపెట్టడం వెనుక కూడా ఆయన మైండ్ గేమ్ ఉందని సబ్బంహరి విమర్శించారు. జగన్ కు కోర్టులు అన్యాయం చేశాయనే భావనను జనాల్లో కలిగించేందుకే లేఖను బయటపెట్టారని చెప్పారు.