New Delhi: వాయు కాలుష్యంపై రాష్ట్రపతి భవన్ ముందు రాత్రంతా బాలిక నిరసన
- ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యంపై విమర్శలు
- ప్లకార్డును ప్రదర్శించిన లిసిప్రియా కంగుజమ్
- ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్య
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యంపై తొమ్మిదేళ్ల బాలిక రాష్ట్రపతి భవన్ ముందు అర్ధరాత్రి నిరసనకు దిగింది. మొన్న రాత్రి నుంచి నిన్న ఉదయం వరకూ బాలిక లిసిప్రియా కంగుజమ్ అక్కడే ఉండి ప్లకార్డును ప్రదర్శించి, మీడియాతో మాట్లాడింది. కాలుష్యంతో నిండిపోయిన గాలిని పీల్చలేక ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పింది.
దీని నుంచి ఎలా బయట పడతామని ఆందోళన చెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గాలి కాలుష్యంపై చర్యలు తీసుకోవడం మానేసిన రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించింది. ప్రభుత్వాలు ఇప్పటివరకు సరైన చర్యలేమీ తీసుకోలేదని తెలిపింది. కలుషిత గాలిని పీల్చడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆమె గుర్తు చేసింది.
ఢిల్లీలో తమకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేసింది. ఢిల్లీని గాలి కాలుష్యం నుంచి రక్షించాలని, మంచి వాతావరణం తీసుకొచ్చేలా చట్టం చేయాలని కోరింది. ఆ బాలికతో పాటు
మరికొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు కూడా నిరసనలతో ఆమెకు మద్దతుగా పాల్గొన్నారు.
నిరసన ప్రదర్శన ముగిసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని వారందరూ కలిశారు. వాయు కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను మూసేయాలని డిమాండ్ చేశారు. కాగా, లిసిప్రియా బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె అందిస్తోన్న సేవలకు గానే ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది.