Undavalli Arun Kumar: జగన్ కేసుల విచారణపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

Undavalli Arun Kumar sensational comments on Jagan cases

  • జగన్ లక్ష కోట్లు సంపాదించారనే మాట జనాల్లోకి బలంగా వెళ్లింది
  • ఛార్జిషీట్లలో ఆ మొత్తం రూ. 1300 కోట్లు ఉండొచ్చు
  • ఒక సీఎం ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయి

తన తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రూ. లక్ష కోట్లు సంపాదించారనే మాట జనాల్లోకి బలంగా వెళ్లిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అయితే, తనకు తెలిసినంత వరకు జగన్ పై ఉన్న ఛార్జిషీట్లలో ఆ మొత్తం రూ. 1300 కోట్ల వరకు ఉండొచ్చని అన్నారు.

ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా... అందరూ కుమ్మక్కై శిక్షించారనో, అందరూ కుమ్మక్కై విడిచిపెట్టారనో చెప్పుకోవడానికి ఇప్పటికే అధికార, విపక్షాలు కావాల్సినంత సరంజామాను రెడీ చేసుకున్నాయని అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇలాంటి ముఖ్యమైన కేసులను వర్చువల్ కోర్టు ద్వారా విచారించాలని, వాటిని లైవ్ టెలికాస్ట్ చేయాలని ఉండవల్లి కోరారు. దీనివల్ల నిందితులంతా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. నిందితుల ముందు కెమెరా పెడతారని, జడ్జికి అందరూ కనిపిస్తారని, అందరికీ జడ్జి కనిపిస్తారని, ఈ మొత్తం విచారణను టీవీలకు లైవ్ కూడా ఇవ్వొచ్చని చెప్పారు.

ఈ వర్చువల్ విచారణ ఏర్పాటు చేసినట్టైతే... కేసుల విచారణకు సంబంధించి కోర్టులో ఏం జరుగుతుందో ప్రజలందరికీ చూసే అవకాశం కలుగుతుందని ఉండవల్లి అన్నారు. దీనివల్ల కోర్టు ఏవిధంగా తీర్పు ఇచ్చిందనే విషయం కూడా అందరికీ తెలుస్తుందని... శిక్ష పడితే ఎందుకు పడిందో? శిక్ష పడకపోతే ఎందుకు పడలేదో? తెలుసుకునే అవకాశం జనాలకు లభిస్తుందని చెప్పారు. చాలా దేశాల్లో ఇలాంటి లైవ్ టెలికాస్ట్ ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టును తాను కోరడం జరిగిందని చెప్పారు.

వాస్తవానికి కోర్టులో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదని... ఒక్కో పేపర్ లో ఒక్కో మాదిరి వార్త వస్తోందని ఉండవల్లి అన్నారు. దీనికి కారణం కొన్ని పేపర్లు అధికార పక్షానికి, మరికొన్ని పేపర్లు ప్రతిపక్షానికి మద్దతుగా ఉండటమేనని చెప్పారు. వర్చువల్ కోర్టుల ద్వారా అసలు విషయం అందరికీ తెలుస్తుందని... కోర్టులో జరిగిన విషయాన్ని ఎవరూ వక్రీకరించే అవకాశం లేదని చెప్పారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ కేసులను ఎదుర్కొంటున్నారని... ఈ నేపథ్యంలో వీరి కేసుల విచారణను వర్చువల్ కోర్టుల ద్వారా నిర్వహిస్తేనే మేలని అన్నారు.

  • Loading...

More Telugu News