Kollu Ravindra: బీసీ సంక్షేమం నేపథ్యంలో సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన కొల్లు రవీంద్ర
- బీసీలను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యలు
- తమపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ
- బీసీల నిధులు దారిమళ్లిస్తున్నారని ఆగ్రహం
ఇటీవలే బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమం విషయంలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత 16 నెలల్లో బీసీల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న జగన్ సర్కారు ఎవరికి, ఎప్పుడు, ఏ పథకం కింద సాయం చేశారో చెప్పాలని అన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు, స్వయం సహాయక రుణాల్లోనూ జగన్ ప్రభుత్వం బలహీన వర్గాలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో బీసీలు సుమారు 2.50 కోట్ల మంది ఉంటే, నవరత్నాల కింద లబ్ది పొందింది కేవలం 4.37 లక్షల మంది మాత్రమేనని ఆరోపించారు. చేతి, కుల వృత్తుల వారికి టీడీపీ సర్కారు రూ.900 కోట్లు కేటాయించిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీలను పట్టించుకోకుండా, జగన్ సర్కారు 95 శాతం నిధులను నవరత్నాలకే మళ్లిస్తోందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు 56 కులాలకు మాత్రమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఈ కార్పొరేషన్లు, వాటిలోని పదవులు ఉత్సవ విగ్రహాలతో సమానం అని విమర్శించారు.
రాజకీయంగానూ బీసీ నేతలను వేధిస్తున్నారని, తనపైనా, అచ్చెన్నాయుడిపైనా, యనమల రామకృష్ణుడిపైనా, అయ్యన్నపాత్రుడిపైనా పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని కొల్లు రవీంద్ర వెల్లడించారు. టీడీపీలో చురుగ్గా ఉన్న బీసీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలన్నదే జగన్ ఉద్దేశం అని అన్నారు.