Pawan Kalyan: ఏపీ, తెలంగాణ ప్రజలకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Telugu people on the start of Dasara season

  • నేటి నుంచి దసరా నవరాత్రులు
  • సంప్రదాయాలు వికసిస్తే జాతి శోభిల్లుతుందన్న పవన్
  • కరోనా నేపథ్యంలో సందడి తగ్గిందని వెల్లడి
  • అయినప్పటికీ భక్తిలో తేడా లేదని వివరణ

దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు అశ్వయుజ శుద్ధ పాడ్యమి అని, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించే శుభ దినాలే ఈ దేవీ నవరాత్రులు అని వివరించారు. దేశ ప్రజలందరూ జరుపుకునే ఈ పవిత్ర పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారని తెలిపారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఈ సందర్భంగానే నిర్వహిస్తారని, బతుకమ్మ పూజలలో శక్తి ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన, ఆటపాటలు కూడా కలగలిసి ఉంటాయని పేర్కొన్నారు. ఎంగిలి బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో పూలు, పిండివంటలు తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, సంప్రదాయాలు ఎక్కడ విలసిల్లుతాయో అక్కడ జాతి శోభిల్లుతుందని తాను విశ్వసిస్తానని పవన్ తెలిపారు.

ఇక, విజయవాడగా మారిన విజయవాటికలో కొలువుదీరిన దుర్గమ్మ ఉత్సవాలు తెలుగు వారందరికీ వెలుగును ప్రసాదిస్తాయని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాలు అన్నీ భక్తిపారవశ్యంతో కళకళలాడుతుంటాయని తెలిపారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, రాయలసీమలోని దేవరగట్టు వేడుకలు మన ప్రాంతీయ సంప్రదాయాలకు నిదర్శనాలని వెల్లడించారు.

అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో దసరా ఉత్సవాలలో కొంత సందడి తగ్గిందని, అయినప్పటికీ ప్రజల్లో భక్తిప్రపత్తులలో మాత్రం మార్పులేదని స్పష్టం చేశారు. ఉత్సవాలకు ఉన్న ప్రాధాన్యతను ఈ అంశం నిరూపిస్తోందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News