Hackers: యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కు కూడా నకిలీ రూపొందించి యూజర్లను బోల్తాకొట్టిస్తున్న చైనా హ్యాకర్లు
- నకిలీ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తో రెచ్చిపోతున్న హ్యాకర్లు
- నిజమైనదే అని భ్రమింపజేసేలా నకిలీ సాఫ్ట్ వేర్
- అప్రమత్తం చేసిన గూగుల్
చైనా ప్రభుత్వంతో సంబంధమున్న కొందరు హ్యాకర్లు యూజర్లను బోల్తాకొట్టించేందుకు ఏంచేస్తున్నారో చూడండి! సాధారణంగా కంప్యూటర్లకు వైరస్ లు, మాల్వేర్లను ప్రబల శత్రువులుగా భావిస్తుంటారు. వాటిని ఎదుర్కొనేందుకు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను ఉపయోగిస్తుటారు. అయితే చైనా హ్యాకర్లు ఈ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లకు నకిలీలు రూపొందించి, వాటిని యూజర్లు డౌన్ లోడ్ చేసుకునేలా భ్రమింపజేస్తున్నారు.
ముఖ్యంగా, ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ మెకాఫీకి చైనా హ్యాకర్లు నకిలీ రూపొందించారని, ఆ నకిలీ సాఫ్ట్ వేర్ నిజమైనదేనని నమ్మిన యూజర్లు దాన్ని డౌన్ లోడ్ చేసుకునే ముప్పు పొంచి ఉందని గూగుల్ వెల్లడించింది. దీనిపై గూగుల్ విపత్తుల విశ్లేషణ సమూహం అధిపతి షేన్ హంట్లీ ఓ బ్లాగ్ పోస్టులో వివరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో హ్యాకర్లు ఈ తరహా దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ నకిలీ యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ ను గిట్ హబ్, డ్రాప్ బాక్స్ వంటి ఆన్ లైన్ సేవల వేదికల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని వివరించారు. ఈ విషయమై ఇప్పటికే అమెరికా ప్రభుత్వ నిఘా వర్గాలు హెచ్చరించాయని హంట్లీ తెలిపారు.