Nalgonda District: పోలీసు దెబ్బలు తాళలేక వృద్ధురాలి మృతి.. అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి

Woman dead after police hand over to her family members in Nalgonda dist

  • నాటుసారా తయారీ సమాచారంతో గ్రామంపై పోలీసుల దాడి
  • మహిళను తీసుకెళ్లి తిరిగి రాత్రి అప్పగించిన పోలీసులు
  • ఒంటి నొప్పులతో బాధపడుతూ మృతి చెందిన వృద్ధురాలు
  • మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థుల ధర్నా

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు దెబ్బలకు తాళలేక వృద్ధురాలు మృతి చెందిందని ఆరోపిస్తూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మృతదేహంతో ధర్నా నిర్వహించి వృద్ధురాలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వారికి హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెంలో నాటుసారాను తయారు చేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో గ్రామానికి చెందిన కేతావత్ సక్రి (55) ఇంటిపై దాడిచేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని శుక్రవారం ఉదయం పంపిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు.

అయితే, శుక్రవారం ఉదయం ఎస్ఐ నాగుల్ మీరా గ్రామానికి చేరుకుని సక్రిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె నిరాకరించింది. దీంతో వృద్ధాప్య పింఛను ఇప్పిస్తామని చెప్పి నల్గొండలోని డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్‌ (డీటీసీ)కి తీసుకెళ్లారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో తిరిగి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నిన్న ఉదయం నుంచి ఒంటి నొప్పులతో బాధపడుతున్న సక్రి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతి చెందింది. దీంతో పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. న్యాయం చేయాలంటూ మృతదేహంతో ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ హామీతో చివరికి ఆందోళన విరమించారు.

  • Loading...

More Telugu News