Amit Shah: ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోం: చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన
- భారత సైన్యం సన్నద్ధంగా ఉంది
- దేశాన్ని కాపాడుకోగల నాయకత్వం ఉంది
- ఏ దేశాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం
యుద్దానికి సన్నద్ధంగా ఉండాలంటూ తన సైనిక బలగాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారత హోంమంత్రి అమిత్ షా అదే స్థాయిలో స్పందించారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.
చైనాకు ఒక్క అంగుళం భూమిని వదులుకోవడానికి కూడా భారత్ సిద్ధంగా లేదని అమిత్ షా అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపాడుకోగల సత్తా భారత సైన్యానికి, రాజకీయ నాయకత్వానికి ఉందని చెప్పారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి ఏ దేశ సైన్యమైనా సిద్ధంగానే ఉంటుందని అన్నారు. అదే విధంగా భారత సైన్యం కూడా ఏ దేశాన్నైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటుందని చెప్పారు. తాను ఏ దేశాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని... అయితే, తమ సైన్యం రెడీగా ఉంటుందనే విషయాన్ని మాత్రం చెపుతున్నానని అన్నారు.