China: తైవాన్ పై చైనా యుద్ధభేరి!... సరిహద్దులకు తరలుతున్న సైన్యం
- డీఎఫ్-17 క్షిపణులను మోహరించిన చైనా
- తైవాన్ గగనతలంలో చొరబడిన చైనా యుద్ధ విమానాలు
- తైవాన్ పై దాడి అంత ఈజీగా కాదన్న అమెరికా
- తైవాన్ కు బాసటగా అమెరికా మోహరింపులు
తైవాన్ పై సైనిక చర్యకు చైనా సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తైవాన్ తమ అంతర్భాగమేనని చెబుతున్న చైనా, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆ చిన్న భూభాగంపై యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా భారీగా మోహరింపులు చేపట్టింది. భారీగా సైన్యాన్ని తరలించిన చైనా ప్రభుత్వం అత్యాధునిక డీఎఫ్-17 క్షిపణులను కూడా మోహరించింది.
డీఎఫ్-17 మిసైల్ హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. పాత డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణులకు బదులు ఈ అత్యాధునిక మిసైల్ ను మోహరించడం ద్వారా తైవాన్ లోని ప్రతి ప్రాంతం తమ పరిధిలో ఉందని చైనా హెచ్చరించినట్టయింది. మరింత కవ్వించే రీతిలో ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమనాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి.
అటు అమెరికా కూడా తైవాన్ పై చైనా యుద్ధ సన్నద్ధను నిర్ధారించింది. చైనాతో యుద్ధానికి తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ తెలిపారు. అయితే తైవాన్ పై దాడి చేయడం చైనాకు అంత సులభమేమీ కాదని, చైనా తన సేనలను తైవాన్ పైకి నడిపే ముందు ఓసారి అమెరికా వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఓబ్రయాన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకుందంటే చైనా చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
తైవాన్ విషయంలో చైనా చర్యలను చాన్నాళ్లుగా గమనిస్తున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ధనౌకలను మోహరించి తైవాన్ కు తానున్నాననే భరోసా కల్పిస్తోంది. అంతేకాదు, తైవాన్ కు భారీగా ఆయుధ సంపత్తిని అందిస్తోంది.